మంత్రములలో శిరోభూషణంగా వేదములు, ఋషులు అంగీకరించింది నారాయణ అష్టాక్షరి, ఇది తెలియవల్సిన అర్థాలనన్నింటిని స్పష్టంగా తెలుపుతుంది. అన్ని గ్రంథాల్లో మనకు తెలియాల్సిన విషయాలు అక్కడక్కడా చెదిరి ఉంటాయి, వాటినన్నింటినీ ఒక చోట చేర్చి చూపేది నారాయణ అష్టాక్షరీ మహా మంత్రం. ఇది ముఖ్యంగా మూడు విషయాలను అందులో ఉన్న పదముల ద్వారా తెలియజేస్తుంది. ఈ మంత్రం ఎనిమిది అక్షరములు లేక మూడు పదములు కలిగి ఉంటుంది. ఈ మంత్రం ఆవిర్భవించే సమయంలోనే ఎనిమిది అక్షరాలతో ఆవిర్భవించింది. అందులో ఉన్నవి ఓం ఒక పదం, నమో ఒక పదం మరియూ నారాయణాయ అనేది మరొక పదం. ఇలా మూడు పదాల క్రింద విడదీస్తే మొదటి పదం మన స్వరూపం ఏమిటి అనేది చెబుతుంది. రెండో పదం మనం ఏమిచేయాలో చెబుతుంది, ఉపాయం అని అంటారు. మూడోది ఉపాయాన్ని పట్టుకొని పొందాల్సింది ఏమిటి అని చెబుతుంది, దీన్నే ప్రాప్యం లేక ఉపేయం అని అంటాం. ఇలా మూడు పదాలుగా విడదీసి చెప్పుకోవడం అందులో కల ఒక అందం. అట్లా కాక రెండు పదాలుగా విడదీసి అంటే, 'ఓం నమో' అని ఒక పదంగా, 'నారాయణాయ' అని రెండో పదంగా విడదీసి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి పదం మనం ఏమాత్రం తనంతట తానుగా ప్రవర్తించగలిగినది మన స్వరూపం కాదు అని చెబుతుంది. కేవలం వెనకాతల నడిపించే వాడిపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే పరతంత్రత అని అంటారు. అంటే మన స్వరూపం పరతంత్రతను కలిగినది, కనుక మనం చేయదగినది వాడిముఖ వికాసం కలిగించే సేవ, దీన్నే కైంకర్యం అని అంటారు. ఇలా ఇదొకరకంగా చెప్పుకొనే విధానం.
No comments:
Post a Comment